Jack: ‘జాక్’ ప్రేక్షకులకు క్రాక్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర్ సినీ చిత్ర
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య, ప్రకాశ్ రాజ్, వీకే నరేష్, రవి ప్రకాశ్, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణి
నేపధ్య సంగీతం : సామ్ సీఎస్, సినిమాటోగ్రఫి : విజయ్ కే చక్రవర్తి
ఎడిటర్ : నవీన్ నూలి, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: ‘బొమ్మరిల్లు’ భాస్కర్
విడుదల తేది : 10.04.2025
నిడివి : 2 ఘంటల 16 నిముషాలు
సిద్ధూ జొన్నలగడ్డ అనగానే మనకి గుర్తొచ్చేది టిల్లు క్యారెక్టర్. ఎందుకంటే యూత్‌కి అంతగా కనెక్ట్ అయింది ఈ పాత్ర. అందుకే టిల్లు ఏం చేసినా జనాలు ఎంజాయ్ చేస్తారు. అలాంటి సిద్ధూతో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సినిమా అనగానే డిఫరెంట్ జోనర్ అనుకున్నారు. ఇక ఈ కాంబోకి ‘బేబీ’ వైష్ణవి చైతన్య తోడైంది. మరి ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘జాక్’ సినిమా ఎలా ఉంది? సిద్ధూకి మరో హిట్ వచ్చిందా లేదా సమీక్షలో చూద్దాం!
కథ:
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ Sidhu Jonnalagadda (సిద్ధూ జొన్నలగడ్డ)కి చిన్నప్పటి నుంచీ ఏ ఒక్క పని మీద ధ్యాస ఉండదు. క్రికెట్‌తో మొదలు పెట్టి ఆడిన ప్రతి ఆటలోనూ, చేసే ప్రతి పని లోనూ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో మధ్యలోనే దాన్ని వదిలేసి వేరే పని మీద దృష్టి పెడతాడు. ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా సరే జాక్‌కి ట్రైనింగ్ ఇవ్వలేమని చాలా మంది కోచ్‌లు, ట్రైనర్లు చేతులెత్తేస్తారు. దీంతో తనకి ఏది నచ్చితే ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ చేసే ప్రతి పనిని చాలా పక్కాగా చేస్తాడు. అలా మొత్తానికి రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో జాయిన్ కావాలని గట్టిగా డిసైడ్ అవుతాడు. ఇందుకోసం చాలా కష్టపడతాడు. ‘రా’ ఇంటర్వ్యూ వరకూ వెళ్తాడు. తనకి పక్కాగా జాబ్ వస్తుందని.. సెలెక్ట్ అయ్యేవరకు మనలోని దేశభక్తి ఆగుతుందా అంటూ ముందే తన మిషన్ మొదలుపెడతాడు. అందులో భాగంగా ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థ హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్‌ని ఆపే క్రమంలో ఒక స్లీపర్ సెల్‌ని జాక్ పట్టుకుంటాడు.
అయితే ఒక కన్ఫ్యూజన్‌లో ‘రా’ ఏజెంట్ అయిన మనోజ్ Prakash Raj (ప్రకాష్ రాజ్)ని కూడా కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఒక పక్క రా టీం అలాగే టెర్రరిస్ట్ బ్యాచ్ కూడా జాక్‌ని ట్రేస్ చేసే పనిలో పడతారు. ఈ మధ్యలో అసలు తన కొడుకు జాక్ ఏ పని చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతని తండ్రి Sr Naresh(నరేష్) తాపత్రయపడుతుంటాడు. ఇది తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ Vishnavi(వైష్ణవి)ని సంప్రదిస్తాడు. మొత్తానికి ఆ లేడీ డిటెక్టివ్ కారణంగా జాక్ ‘రా’ టీంకి చిక్కుతాడు. అప్పుడు అసలు జాక్‌ని రా టీమ్ సెలక్ట్ చేయలేదని తెలుస్తుంది. దాంతో ఎలాగైనా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని పట్టుకోవాలని జాక్ నేపాల్ వెళ్తాడు. చిన్నతనంలో అన్ని విషయాల్లో ప్రతిభను చాటుకొన్న జాక్ ఏ అంశంలోను ఎందుకు సెటిల్ కాలేకపోతాడు? రా ఉద్యోగం కోసమే ఎందుకు ప్రయత్నిస్తాడు? రా విభాగంలో జాక్ ఉద్యోగం లభించిందా? ఉగ్రవాదులపై జాక్ ఎందుకు కన్నేశాడు? టెర్రరిస్టులను పట్టుకొని జాక్ ఏం చేశాడు? చివరకు తన లక్ష్యాన్ని జాక్ చేరుకొన్నాడా? అనే సింపుల్ ప్రశ్నకు సమాధానమే మిగతా సినిమా కథ.
నటి నటుల హవాబావాలు:
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న సిద్దూ జొన్నలగడ్డ మరో తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. అయితే బలహీనమైన స్క్రిప్టును కూడా తన స్క్రీన్ ప్రజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో మెప్పించాడు. సహాజంగా అతను చెప్పే డైలాగ్స్ తన క్యారెక్టర్‌కు ఈ సినిమాలో ప్లస్ అయింది. సిద్దూ లుక్, స్టైల్ బాగుంది. కానీ బలమైన క్యారెక్టర్ లేకపోవడమే మైనస్‌గా కనిపిస్తుంది. జాక్ క్యారెక్టర్‌కు అసలు పర్పస్ ఏమిటనే విషయంలో అనేక సందేహాలు కనిపిస్తాయి. బేబీ తర్వాత వైష్ణవీ చైతన్య కోసం వెళితే.. నిరాశే మిగులుతుంది. సినిమాలో ఆమె నటించడానికి స్కోప్, గ్లామర్ పండించడానికి అవకాశం లేకపోవడంతో తను ఏమీ చేయలేకపోయింది. ప్రకాశ్ రాజ్ పక్కా రొటీన్ పాత్రగా ఉంటుంది. బ్రహ్మజీ, సుబ్బరాజ్ పాత్రలు పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా వారి వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
భాస్కర్ చిత్రాలపై ఆడియన్స్‌కి చాలా నమ్మకం ఉంటుంది. బొమ్మరిల్లు నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వరకూ ఆయన సినిమాలన్నీ సరిగ్గా గమనిస్తే హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా బలంగా ఉంటాయి. ప్రతి పాత్రని చాలా స్ట్రాంగ్‌గా రాస్తారు భాస్కర్. అందుకే సినిమా ఫలితం ఏదైనా సరే ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనికి సరైన ఉదాహరణ ఆరెంజ్. ఇక జాక్ విషయానికొస్తే హీరో పాత్రని ఆయన డిజైన్ చేసిన విధానం బావుంది. కానీ వాస్తవానికి అది ఎంత దగ్గరగా ఉందనేది ఆయన మిస్ చేశారు. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త మంచి ఫలితం వచ్చి ఉండేదనిపిస్తుంది. సినిమా చివరిలో ఓ డైలాగ్ స్క్రీన్ మీద పడింది.”ఓ శిలై ఉన్నానని భూమి కుంగునా? నే ఒక శిల్పాన్నని దైవం తుళ్లునా? మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది.. శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా? రెంటి మధ్యన..!” మరి దీనికి అర్థం ఏంటో.. దీనికి సినిమాకి లింక్ ఏంటో దర్శకుడికే తెలియాలి. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫి, సామ్ సీఎస్ బీజీఎం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, పాటలకు స్కోప్ లేకపోయింది. టైటిల్ సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. డ్యూయెట్ సాంగ్ పెద్దగా కిక్కిచ్చేలా కనిపించలేదు. మూవీ ఫుల్ రిచ్‌గా ఉంటుంది. శ్రీ వెంకటశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు.
విశ్లేషణ:
అసాధ్యమైన పనులు హీరోలు చేయడం మన సినిమాల్లో సహజమే. కానీ ఒక దేశ ఏజెన్సీ కంటే గొప్పగా ఆ హీరో ఉండటం, పనులు చేయడం అనేది ఆడియన్స్‌కి కూడా నమ్మేలా అనిపించలేదు. ఇక మదర్ సెంటిమెంట్ పాయింట్‌తో యాక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రం జాక్. అయితే మదర్ సెంటిమెంట్ ఆధారంగా కథను నడిపించడానికి స్కోప్ ఉన్నా.. ఆ పాయింట్‌ను ఎందుకు విస్మరించారో అర్ధం కాని విషయం. కథలో బలం లేకపోవడం వల్ల స్క్రీన్ ప్లే ద్వారా సినిమాను లాగిద్దామనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. సిద్దూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అంతే! వైష్ణవీ చైతన్య తన అభిమానులకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. సరైన కథ లేకుండా బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ప్రయోగం అంతగా ఆకట్టుకొనేలా లేదనే చెప్పాలి. సిద్ధూ ఫ్యాన్స్ అయితే సినిమాని ఓసారి చూడొచ్చు.