ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు : ఉపరాష్ట్రపతి
తెలుగుఖ్యాతిని ప్రపంచమంతా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించడం సంతోషకరమన్నారు. సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజుగా వెంకయ్య అభివర్ణించారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ను గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమని, ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు వారంతా తెలుగులో మాట్లాడడమే ఎన్టీఆర్కు అసలైన నివాళి అని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఎన్టీఆర్ బయోపిక్ ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగించడం అభినందనీయం. ఎన్టీఆర్ జీవితాన్ని నవతరానికి అందించే ప్రయతం చేయడం సంతోషం. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.













