డార్లింగ్ అభిమానుల కోసం…
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా అన్నిరంగాలూ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జనానికి ఎంటర్టైన్మెంట్నిచ్చే సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రిలీజ్‌కి వచ్చిన సినిమాలు ల్యాబ్స్‌లోనే ఉండిపోయాయి, నిర్మాణంలో ఉన్న సినిమాలు నిలిచిపోయాయి. దీంతో ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఉండడం లేదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఆయా హీరోల అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేసిన ‘సాహో’తో నిరాశపరచినా రాధాకృష్ణకుమార్‌తో చేస్తున్న 20వ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వచ్చాయి. హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో డేట్స్ కేటాయించిందని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్డౌన్ పూర్తయి షూటింగు స్టార్ట్ అవ్వగానే ఈ సినిమా కోసమే పూజా ఎక్కువ రోజులు పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘ఓ డియర్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అందుకే ప్రస్తుతం ఈ సినిమాని ప్రభాస్20గా పిలుస్తున్నారు. ఈ సినిమాలో కొంత భాగాన్ని జార్జియాలో షూట్ చేశారు. మరో షెడ్యూల్ కోసం యూరప్‌ను ఫైనల్ చేశారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అక్కడ షూటింగ్ చేసే అవకాశం ఉంది. యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగశ్రీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరలో సినిమాలో రిలీజ్ చెయ్యాలని మొదట ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ బాగా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.













