డార్లింగ్ దెబ్బకి క్రాష్ అయిన ఆహా యాప్..!
ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహా సగర్వంగా అందిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 2 సంచలనంగా మారుతోంది. ప్రతివారం ఇంట్రెస్టింగ్ గా ఉండేందుకు ప్రత్యేక అతిథులను ఇన్వైట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. సీజన్ 2 లో అన్ స్టాపబుల్ షోలో పలువురు స్టార్ హీరోలు పాల్గొన్నారు. ఈ తరుణం లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ షో కి గెస్ట్ గా రావడం అందరి దృష్టిని ఆకర్షించింది..
మామూలుగానే జనాలకి ప్రభాస్ అంటే పిచ్చి. ఆహా లో స్ట్రీమింగ్ కానున్న తమ అభిమాన హీరో ఎపిసోడ్ చూడడానికి వెయ్యి కళ్ళతో డార్లింగ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆహా యాప్ క్రాష్ అయిందని తెలిసింది. ప్రభాస్ చాలా కాలానికి ఇలా ఓటీటీలో కనిపించడం విపరీతంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ బాలయ్యతో ముచ్చటించిన ఈ షో ని రెండు ఎపిసోడ్స్ గా డివైడ్ చేయడం జరిగింది.
మొదటి భాగాన్ని బాహుబలి అని పిలుస్తున్నారు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి 9 గంటలకు ఆహా యాప్ లో ప్రసారమైంది. కానీ స్ట్రీమింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే యాప్ క్రాష్ అయింది. వీక్షకుల నుండి వచ్చే భారీ ట్రాఫిక్ ను నిర్వహించలేక సర్వర్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆహా టీం ప్రేక్షకులని, ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది.
ఆహా ట్వీట్ చేస్తూ “డార్లింగ్ #ప్రభాస్ అభిమానుల ప్రేమ ఓవర్ లోడ్ కారణంగా మా యాప్ క్రాష్ అయిందని మీకు తెలియజేస్తున్నందుకు క్షమించండి .మేము దానిపై పని చేస్తున్నాము. త్వరలోనే ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తాం” అని తెలిపారు. ఈ సందర్భంగా నెట్టింట #PrabhasOnAha #UnstoppableWithPrabhas అనే హ్యాష్ టాగ్ లు వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాలని ప్రతి ఒక్కరు అనుకోవడమే ఈ యాప్ క్రాష్ కి కారణం అని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆహా యాప్ ఇప్పటికీ డౌన్ లో ఉంది. ఇది ఆన్ లైన్ లో తిరిగి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు అతడి స్నేహితుడు హీరో గోపీచంద్ స్టేజిని షేర్ చేస్కోవడం విశేషం.













