The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. విజయ్ దేవరకొండ
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” (The Girl Friend) సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు. “ది గర్ల్ ఫ్రెండ్” సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
లిరిసిస్ట్ రాకేందు మౌళి మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా సక్సెస్ చేసిన ఘనత అమ్మాయిలతే. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో 60 పర్సెంట్ మహిళా ప్రేక్షకులే ఉంటున్నారు. ఈ సినిమా చూసిన అబ్బాయిలు విక్రమ్ క్యారెక్టర్ నుంచి తమ మిస్టేక్స్ తెలుసుకుంటున్నారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ – రాహుల్ రవీంద్రన్ లాంటి దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నా. ఆయన దర్శకత్వం వహించిన చి.ల.సౌ సినిమాకు సంగీతాన్ని అందించాను. ఆ మూవీ నేను ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడింది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు హేషమ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఆ సాంగ్స్ ను మ్యాచ్ చేసేలా బీజీఎం ఇచ్చాను. ఈ సినిమా చూశాక ఒక అబ్బాయిగా నేను కూడా బెటర్ పర్సన్ గా మారాను. అన్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ మాట్లాడుతూ – డైరెక్టర్ రాహుల్ గారు మహిళల గురించి ఎంత బాగా ఆలోచిస్తారో తెలుసు కాబట్టి ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఆలోచనలే రిఫ్లెక్ట్ అయ్యాయని అనిపించింది. అందుకే మూవీ చూసి నేను సర్ ప్రైజ్ కాలేదు. ఈ సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి సినిమాను ఇప్పుడున్న ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా చేసినందుకు రశ్మికకు ఒక స్పెషల్ గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు ఎప్పటికీ అలాగే నిలిచిఉంటుంది. సినిమా చూశాక దీక్షిత్ నటనను ఎంతో ఇష్టపడ్డాను. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాహుల్, ప్రొడ్యూసర్స్ విద్య, ధీరజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించడం హ్యాపీగా ఉంది. ప్రశాంత్ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ – రాహుల్, నేను కో యాక్టర్స్ గా ఒక తమిళ సినిమా చేశాం. ఆ తర్వాత తను దర్శకుడిగా మారి చి.ల.సౌ సినిమా రూపొందించాడు. ఆ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ లో నటించాను. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో నాది చాలా చిన్న రోల్. అయినా రాహుల్ మీద నమ్మకంతో అంగీకరించాను. నేను బాగా మాట్లాడుతుంటా. అలాంటి నాకు ఈ సినిమాలో డైలాగ్స్ లేవు. రాహుల్ తన లైఫ్ లో చూసిన ఒక మహిళను ఇన్స్ పైర్ గా తీసుకుని నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. చిన్న పాత్ర అయినా సినిమాలో నా రోల్ ఎంతో ఇంపాక్ట్ తీసుకొచ్చింది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చూశాక మగవారు తమ జీవితంలోని మహిళల విషయంలో తమ దృక్పథం మార్చుకుంటారు. అన్నారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చూసిన వాళ్లు నన్ను ఐ హేట్ యూ అంటున్నారు. ఆ ద్వేషించడంలోనూ ఎంతో ప్రేమను ఫీల్ అవుతున్నా. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలు చేస్తుంటాం కానీ ఒక బాధ్యతగా భావించి ఈ చిత్రంలో నటించాను. దసరా సినిమాలో సూరి పాత్రలో నన్ను ఎంత ఆదరించారో, “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో విక్రమ్ గా అంతకంటే ఎక్కువ లవ్ చేస్తున్నారు. రశ్మిక స్టార్ హీరోయిన్ అయినా మాతో చాలా ఫ్రెండ్లీగా కలిసి నటించింది. ఈ సినిమా చూశాక రశ్మికను ఎంతోమంది గర్ల్స్ ఇన్సిపిరేషన్ గా తీసుకుంటున్నారు. భూమాలా ధైర్యంగా ముందడుగు వేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తున్నప్పుడు అమ్మాయిలే కాదు అబ్బాయిలూ చప్పట్లు కొడుతున్నారు. అబ్బాయిల నుంచి ఆ అప్లాజ్ చూసి మేము మాస్ సినిమా చేశామా ఏంటి అనే సందేహం మాలో కలిగింది. ప్రీమియర్స్ నుంచే మీడియా మిత్రులు మా మూవీని ప్రమోట్ చేయడం తమ బాధ్యతగా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ఇలాంటి మంచి చిత్రాన్ని చేసే అవకాశం ఇచ్చిన రాహుల్ కు థ్యాంక్స్. ఆయన నాతో మరో సినిమా చేస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నిర్మిస్తున్న టైమ్ లో మేమొక పవర్ ఫుల్ మూవీ చేస్తున్నామని తెలుసు. ఇందాక మా టీమ్ మెంబర్స్ చెప్పినట్లు రాహుల్ ను చూసిన మాకు ఆయన ఇలాంటి మూవీ చేయడంలో ఆశ్చర్యం లేదనిపించింది. మహిళల ఎమోషన్స్ రాహుల్ ఎంతోబాగా అర్థం చేసుకున్నారు. దీక్షిత్ నటన చూసి మా స్నేహితులు చాలా మంది ప్రశంసించారు. ఒక క్లాసీ పర్ ఫార్మెన్స్ చూపించారు దీక్షిత్. భూమా పాత్రలో నటించడం ద్వారా ఎంతోమంది వుమెన్ కు ఇన్సిపిరేషన్ ఇచ్చారు రశ్మిక. ఈ సినిమాలో భూమాను చూశాక వుమెన్ తమకు ఫ్రీడమ్ వచ్చినట్లు భావిస్తున్నారు. రశ్మిక భూమా పాత్రకు ప్రాణం పోశారు. ఈ మూవీ నిర్మాణంలో భాగమైన ధీరజ్ కు థ్యాంక్స్. స్ట్రాంగ్ మెన్ విజయ్ గారు మా మూవీని సపోర్ట్ చేసేందుకు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు గర్విస్తున్నా. ఇంకెన్ని సినిమాలు చేసినా నాకు ఈ సినిమా తీసుకొచ్చిన గౌరవం రాదు. ప్రేక్షకులు ఇస్తున్న ప్రశంసలతో ఒక జాతీయ అవార్డ్ పొందినంత సంతోషంగా ఉంది. రశ్మిక గారు లేకుంటే ఈ సినిమా లేదు. ఆమె మా మూవీ కోసం ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేశారో ఇప్పటికే చెప్పాను. దర్శకుడు రాహుల్ కు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. తను దర్శకుడిగా వెయిట్ చేసి చేసి మాకోసం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశారు. నన్ను సపోర్ట్ చేస్తున్న అరవింద్ గారికి పాదాభివందనం. విజయ్ అన్న మాకు సపోర్ట్ చేసేందుకు ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. నా మిత్రుడు ఎస్ కేఎన్ కూడా మొదట ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. కానీ ఇలాంటి మంచి చిత్రంతో ప్రొడ్యూసర్ గా నాకు గుర్తింపు, పేరు రావాలని ఆయన తప్పుకున్నారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా సక్సెస్ మా టీమ్ అందరిదీ. మా టీమ్ తో పాటు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను రిలీజ్ కు ముందే చూశాను. హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇంకా అప్పటికి రిలీజ్ కు టైమ్ ఉంది కాబట్టి నా ఫీలింగ్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోలేకపోయాను. బేబి సినిమా రిలీజ్ అయ్యాక విమర్శలు వచ్చాయి. దాంతో కొన్నాళ్లు ఆ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. ఎంత వివరణ ఇచ్చుకున్నా విమర్శలు ఆగలేదు. అప్పుడు రాహుల్ నాతో మాట్లాడి బేబి సినిమాలో నేను ఎక్కడ తప్పులు చేశానో వివరంగా చెప్పారు. రాహుల్ చెప్పిన మాటలతో రియలైజ్ అయి హిందీ బేబి రీమేక్ లో తెలుగులో చేసిన మిస్టేక్స్ లేకుండా చూసుకున్నాను. రశ్మిక గారి ప్రతి సినిమా చూస్తుంటా. నేను రైటర్ గా, డైరెక్టర్ గా ఏ క్యారెక్టర్ రాసుకున్నా, ఆమె గుర్తుకు వస్తుంటారు. “ది గర్ల్ ఫ్రెండ్”లో భూమా పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. దీక్షిత్ ఆడియెన్స్ హేట్ చేస్తున్నారంటే అంత బాగా నటించాడని అర్థం. రాహుల్ లాంటి దర్శకుడిని ఇండస్ట్రీ, నటీనటులు కాపాడుకోవాలి. విద్య అక్క, ధీరజ్ కు ఈ సినిమా విజయంతో పాటు ప్రొడ్యూసర్స్ గా గౌరవాన్ని తీసుకొచ్చింది. అన్నారు.
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – ఏ సినిమా టీమ్ లో అయినా ఆ ప్రాజెక్ట్ ను 200శాతం నమ్మేవారు ఒకరుంటారు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాకు ఆ ఒక్కరు డైరెక్టర్ రాహుల్. తను నమ్మింది సినిమాగా రూపొందించాడు. రాహుల్ విజన్ ను మిగతా టీమ్ అంతా నమ్మారు. మా గీతా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా చేశాడు రాహుల్. రశ్మిక గారి పర్ ఫార్మెన్స్ చూస్తూ ఉండిపోయాం. ఈ సినిమాను ప్రతి గర్ల్ ఫ్రెండ్ తమ బాయ్ ఫ్రెండ్స్ కు చూపించాలి. వాళ్లు బయపడకుండా ఈ సినిమాకు వచ్చారంటే మంచి బాయ్ ఫ్రెండ్స్ కిందే లెక్క. ఈ సినిమా నా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూశాను. “ది గర్ల్ ఫ్రెండ్” టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఈ సినిమాకు మిగతా అందరి కంటే డెడికేటెడ్ గా వర్క్ చేసింది డైరెక్టర్ రాహుల్. మూడేళ్ల పాటు మరే ప్రాజెక్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే కష్టపడ్డారు. ధీరజ్ కు సినిమా అంటే నమ్మకం. తను చేసే ప్రతి సినిమానే ప్రాణంగా భావిస్తాడు. ఇలాంటి కథను సినిమా ద్వారా చెప్పాలని రశ్మిక గారు ముందుకువచ్చారు. ఇలాంటి చిత్రానికి తను అవసరం అని రశ్మిక భావించారు. విద్య అక్క మంచితనం వల్లే ఈ సక్సెస్ లు వస్తున్నాయి. ఆయ్, సింగిల్ సినిమా తర్వాత ఆమె “ది గర్ల్ ఫ్రెండ్” తో హ్యాట్రిక్ అందుకున్నారు. ఏ బంధుత్వం లేకున్నా తన చుట్టూ ఉన్న వాళ్లు సక్సెస్ కావాలని సపోర్ట్ చేసే ఏకైక నిర్మాత అల్లు అరవింద్ గారు. విజయ్ దేవరకొండ లేకుంటే నిర్మాతగా నేను లేను. టాక్సీవాలా సినిమా థియేటర్స్ లో రిలీజై మేమంతా నిలదొక్కుకునేందుకు విజయ్ కారణం. ఆయన త్వరలో బాక్సాఫీస్ అదిరిపోయే మూవీస్ చేయబోతున్నాడు. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – నా గత సినిమా రిలీజై ఆరేళ్లయింది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఫలితం అనుకున్నట్లు రాకుంటే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని భయపడ్డాను. కానీ సినిమా చూశాక నా ఫ్యామిలీ మెంబర్స్ గర్వపడుతున్నారు. థియేటర్స్ కు వెళ్లి చూస్తే మూడొంతుల ప్రేక్షకులు మహిళలే ఉంటున్నారు. మా డార్లింగ్ ప్రొడ్యూసర్స్ విద్య, ధీరజ్ ఈ స్క్రిప్ట్ ను ఎంతో నమ్మారు. అరవింద్ గారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. నేను ఎలా అనుకున్నారో అలా మూవీ చేసేందుకు సపోర్ట్ ఇచ్చారు. రశ్మిక స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఈ కథపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. నేను ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కోల్పోయినా రశ్మికకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం చూసి నాకు ధైర్యం వచ్చేది. రశ్మిక, దీక్షిత్ లాంటి నటులు ఉంటే మాములు సినిమా కూడా అద్భుతంగా ఆదరణ పొందుతుంది. మా మూవీని ప్రేక్షకులే సోషల్ మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేశారు. మీడియా మిత్రులు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. విజయ్ ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు తన వాయిస్ ఇవ్వడంతో ఒక క్రేజ్ తీసుకొచ్చారు విజయ్. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ సినిమా తప్పకుండా చేయాలి, వీలైనంత త్వరగా చేయాలని అనుకున్నా. సినిమాలో నటిస్తున్నప్పుడు కూడా రాహుల్ ఒక వుమెన్ ఎమోషన్ ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడు అనిపించింది. రాహుల్ ను కంప్లీట్ గా నమ్మి భూమా పాత్రలో నటించాను. భూమా లైఫ్ లో జరిగినవి కొన్ని నా లైఫ్ లోనూ చూశాను. నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించేది. ఈ రోజు మా మూవీని థియేటర్స్ లో చూస్తూ చాలా మంది రిలీఫ్ అయినట్లు, ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. మా సినిమాకు, ఈ సినిమా మేము చేయడం వెనక ఉన్న ఉద్దేశం ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు. భూమా పాత్రకు మీరు కనెక్ట్ కావడమే, ఈ పాత్రపై మీరు చూపిస్తున్న అభిమానం అన్ని పురస్కారాల కంటే ఎక్కువ. ఈ సంతోషం ఒకవైపు ఉన్నా, మన సొసైటీలో ఇంతమంది అమ్మాయిలు భూమాలా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను మేము అనుకున్నట్లు చేసే ఫ్రీడమ్ ఇచ్చిన విద్య, ధీరజ్ గారికి థ్యాంక్స్. గీతా ఆర్ట్స్ మా వెనక అండగా ఉంది. డైరెక్టర్ రాహుల్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. దీక్షిత్ నటుడిగా ఒక జెమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. ఈ రోజు మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. విజయ్ లాంటి పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా సక్సెస్ విషయంలో ముందుగా మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ప్రివ్యూ వేసినప్పటి నుంచి మంచి ప్రచారం కల్పించారు. తమ బాధ్యతగా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. ఈ సినిమాకు హీరో మా డైరెక్టర్ రాహుల్. 2021లో ఈ స్క్రిప్ట్ చెప్పాడు. ఓటీటీకి అనుకున్నాడు. కానీ సినిమాగా చేస్తేనే బాగుంటుందని నేను చెప్పేవాడిని. ఎప్పుడు కలిసినా ఈ స్క్రిప్ట్ గురించి గుర్తుచేసేవాడిని. చివరకు మా సంస్థలోనే ఈ సినిమా వస్తుందని అనుకోలేదు. రాహుల్ లాంటి మంచి మనసున్న దర్శకుడే “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి చిత్రాన్ని రూపొందించగలడు. ఈ సినిమాకు అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ బాగా కనెక్ట్ అవుతారు, అప్రిషియేట్ చేస్తారని రాహుల్ మాతో చెప్పేవాడు. అతని అంచనా సినిమా రిలీజ్ అయ్యాక నిజమయ్యింది. మా గీత గోవిందంలో నటించిన రశ్మిక..”ది గర్ల్ ఫ్రెండ్” తో మా సంస్థకు వన్నె తీసుకొచ్చింది. దీక్షిత్ మంచి నటుడు. అతను తెలుగులో రెండు సినిమాలే చేశాడు. దీక్షిత్ పర్ ఫార్మెన్స్ ను మరిన్ని చిత్రాల్లో చూడబోతున్నాం. విజయ్ మేము ఏ ఈవెంట్ కు పిలిచినా గెస్ట్ గా వస్తుంటాడు. అందుకు అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఈ రోజు చూశాను. సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యా. కొన్నిసార్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఈ మూవీ రిలీజ్ అయ్యాక వస్తున్న రెస్పాన్స్ నాకు రశ్మిక, రాహుల్ పంపిస్తుండేవారు. సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వుమెన్ ఎదుర్కోవడం బాధపడాల్సిన విషయం. రిలేషన్ షిప్స్ అంటే ఒకనొకరు గౌరవించుకోవాలి, ఒడిదొడుకుల్లో తోడుండాలి, పరస్పరం ఎదిగేలా సహకరించుకోవాలి. మీ రిలేషన్స్ లో సమస్యలు ఉంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కొంతమందికి ఆ అవేర్ నెస్ ఇస్తుంది. చెప్పినా మీ భాగస్వామి మీ మాట వినకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీకు ఏది సరైనదో ఆలోచించుకోండి. రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లెక్కలు వేసుకోకుండా సొసైటీలో ఉన్న ఇష్యూ నేపథ్యంగా రూపొందించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలిగేలా చేసింది, అవగాహన కల్పిస్తోంది. మహిళలు బయటకు వచ్చి మాట్లాడే స్ఫూర్తిని భూమా కలిగించింది.
బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద నెంబర్స్ క్రియేట్ చేసే సినిమాలు కూడా ఇలాంటి ఇంపాక్ట్ ను సొసైటీపై, ప్రేక్షకులపై వేయలేవు. అందుకు ఈ మూవీ టీమ్ మెంబర్స్ అంతా గర్వపడాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాతో ఒక అఛీవ్ మెంట్ చేశారు. ఈ కథలో చెప్పినవి నా లైఫ్ లో ఫేస్ చేయలేదు. కానీ విన్నాను, విన్న నాకే ఇంత ఎమోషనల్ గా ఉంటే ఆ బాధను అనుభవించేవారికి ఎలా ఉంటుంది. రాహుల్ లాంటి డైరెక్టర్ ఈ ప్రపంచానికి కావాలి. రాహుల్ కు దగ్గరగా ఉన్న వాళ్లంతా ఆయన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇలా అందరి ప్రేమను పొందడం రాహుల్ అదృష్టం. రోహిణి గారితో మూవీస్ చేశాను గానీ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత బాధ కలిగింది. దీక్షిత్ విక్రమ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అను చేసిన దుర్గ పాత్ర చూస్తుంటే ఇలాంటి స్నేహితురాలు ప్రతి అమ్మాయికి ఉండాలని అనిపించింది. గీత గోవిందం నుంచి రశ్మికను చూస్తున్నా. ఆమెకు భూమాకు చాలా పోలికలు ఉన్నాయి. తన కెరీర్ పీక్ లో ఉన్న ఈ టైమ్ లో “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి కథను నేను చెప్పాలి అని ముందుకొచ్చింది. రశ్మిక కెరీర్, సక్సెస్ చూస్తుంటే హ్యాపీగా, గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఎదురెళ్తా, కానీ రశ్మిక ఓపికగా ఉంటుంది. నువ్వేంటో ఒకరోజు ప్రపంచం తెలుసుకుంటుంది. భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. “ది గర్ల్ ఫ్రెండ్” ప్రొడ్యూసర్ అరవింద్ గారు, విద్య, ధీరజ్ ఇతర టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.







