తప్పకుండా తెలుగులో సినిమా చేస్తా
నన్నెంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిది. తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని నాకు మనసులో బలంగా ఉంది. తగిన మంచి కథ కుదిరితే తప్పకుండా తెలుగులో నేరుగా సినిమా చేస్తా అని ప్రముఖ తమిళ హీరో సూర్య అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఎన్జీకే విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా హైదరాబాద్లో పాత్రికేయులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. వైఎస్. జగన్ పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన యాత్రకు సీక్వెల్గా యాత్ర-2 పేరుతో రూపొందబోయే చిత్రంలో తాను నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అన్నారు. అయితే స్క్రిప్టు నచ్చితే ఆ చిత్రం చేసే విషయం గురించి ఆలోచిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను అంగీకరించిన నూతన చిత్రాల గురించి చెబుతూ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం, సుధ కొంగర దర్శకత్వంలోనూ, ఇంకా శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వివరించారు.













