పుష్ప తర్వాత ఎటు నుంచి ఏ అవకాశమొస్తుందో తెలియడం లేదు
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన సునీల్(Suneel) కెరీర్ ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో దూసుకెళ్తోంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు వచ్చిన ఇమేజ్ మార్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కామెడీ హీరోగా మాత్రమే కాకుండా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా తాను రాణించగలనని నిరూపించుకున్న సునీల్‌కు ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటి నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా తమిళ, మలయాళ డైరెక్టర్లు ఆయనలో కొత్త నటుడిని చూస్తుండటం విశేషం. ఇటీవల పాల్గొన్న ఓ ప్రమోషన్ ఈవెంట్లో సునీల్ మాట్లాడుతూ, ఇప్పుడు ఏ భాష నుంచి ఎలాంటి పాత్ర వస్తుందో కూడా ఊహించలేకపోతున్నానంటూ తన కెరీర్లో వచ్చిన ఈ అనూహ్య మార్పుపై ఆనందం వ్యక్తం చేశారు.
జైలర్(Jailer) తర్వాత తమిళ ప్రేక్షకుల్లో తనకు మరింత గుర్తింపు పెరిగిందని సునీల్ వెల్లడించారు. పుష్ప కేరళలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తాను తెలుగు నటుడిననే విషయం చాలామందికి తెలియదని, నేరుగా తమిళ నటుడిగానే భావించి సీన్ పేపర్లు ఇస్తున్నారని చెప్పారు. భాష కంటే నటనపై దర్శకులు నమ్మకం పెడుతున్న ఈ దశ తనకు కొత్త అనుభూతిని ఇస్తోందన్నారు. గతంలో ఒకే తరహా పాత్రల్లో కనిపించిన నటులకు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విభిన్న అవకాశాలు వస్తుండటం సినీ పరిశ్రమలో వచ్చిన పెద్ద మార్పుగా ఆయన అభివర్ణించారు.
తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సునీల్, అసలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తాను నెగిటివ్ రోల్స్ చేయాలనే ఆలోచనతోనే వచ్చానని చెప్పడం ఆసక్తి రేపింది. నటనపై ఉన్న ప్రేమే తనను ఇంతకాలం నిలబెట్టిందని పేర్కొన్న ఆయన, అభిమాన హీరోగా చిరంజీవి(Chiranjeevi) పేరును ప్రస్తావించారు. చిన్నప్పుడు చిరంజీవి సినిమా టికెట్ కోసం థియేటర్ల వద్ద క్యూల్లో నిల్చున్న రోజుల నుంచి, చివరకు ఆయనతో కలిసి నటించే స్థాయికి రావడం తన జీవితంలో మర్చిపోలేని ప్రయాణమని సునీల్ భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం భాషలకు అతీతంగా వస్తున్న అవకాశాలతో నటుడిగా మరో కొత్త దశను ఆస్వాదిస్తున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి







