ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ‘ఆర్ ఆర్ ఆర్’.. పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న రాజమౌళి!
బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకుల్లో, సినీవర్గాల్లో భారీ అంచనాలపై ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ధీటుగా ఇప్పటివరకు షూటింగ్‌ను విజయవంతంగా చేసిన రాజమౌళి లాక్డౌన్ కారణంగా షూటింగ్‌ను నిలిపివేశారు. ఈ సినిమా అనుకున్న సమయానికి సంవత్సరం ఆలస్యంగా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో షూటింగ్‌ను త్వరలోనే అంటే దసరా తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ లేట్ అవ్వడానికి కరోనా ఒక కారణమైతే హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ గాయాల పాలవ్వడం మరో కారణం. ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో రామ్‌చరణ్ మోకాలుకు గాయమైంది. ఆ తర్వాత మరో యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌కి కూడా గాయమైంది. దీనివల్ల మూడు నెలలు షూటింగ్ చెయ్యడానికి వీలు పడలేదు. సినిమాను త్వరగా పూర్తి చేయాలని నిర్మాత వత్తిడి తెస్తున్న కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ప్రారంభించబోతున్నారని సమాచారం.
ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ వున్న వర్క్‌లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయట. అందుకే ఈసారి కొంతమంది నిపుణుల పర్యవేక్షణలోనే సేఫ్‌గా షూటింగ్ జరిపేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో రిస్కీ ఫైట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. దానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా తమ సహకారాన్ని అందిస్తామని తెలియజేయడంతో ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి. నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాను ఈ సంవత్సరంలోనే పూర్తి చేయాలన్నది రాజమౌలి ప్లాన్. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేసేలా యూనిట్‌ను ఉత్సాహపరిచే పనిలో పడ్డాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది సంతోషకరమైన వార్తే మరి.













