O Yeong Su: లైంగిక వేధింపుల కేసులో జైలు పాలైన నటుడు
ప్రముఖ కొరియన్ నటుడు ఓ యోంగ్ సు(O Yeong Su) కి జైలు శిక్ష పడింది. ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆయనకు సంవత్సరం పాటూ జైలు శిక్ష విధించంది కోర్టు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్(Squid Game)’లో ప్లేయర్ నంబర్ 001 పాత్రలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచారు ఓ యోంగ్ సు. 80 ఏళ్ల వయసులో కూడా తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు.
అలాంటి అతడు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 2017లో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో కోర్టు నటుడికి ఒక సంవత్సరం జైలు శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. ఓ యోంగ్ సు తన నేరాన్ని అంగీకరించనప్పటికీ, బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో పని చేస్తున్న ఓ యోంగ్ సు, ఓ జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆమె భయంతో జీవిస్తోందని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఇరు పక్షాల వాదన తర్వాత కోర్టు నటుడికి ఏడాది పాటూ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే కోర్టు విచారణ సమయంలో కూడా సదరు నటుడు కొంచెం కూడా పశ్చాత్తాప పడకపోవడం విశేషం.













