ఒక్కరోజు తేడాలో ఇద్దరు స్టార్ హిరోల అభిమానులు పండగ చేసుకోబోతున్నారు
సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. అంటే ఇప్పటివరకు స్తబ్ధుగా ఉండిపోయిన పరిశ్రమ కొన్ని సినిమాల షూటింగులు ప్రారంభం కావడంతో కళకళలాడుతోంది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సినిమా పరిశ్రమలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావచ్చిన సినిమాలు, సగం షూటింగ్ చేసిన తర్వాత ఆగిపోయిన సినిమాలు మళ్లీ సెట్స్‌పైకి వెళుతున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన షూటింగులు ఇక ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ , రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు వారిని సంతోషపెట్టేందుకు ఆ రెండు సినిమాల టీజర్లను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్‌ను ఎన్టీఆర్ బర్తడేకి రిలీజ్ చెయ్యాలని భావించారు. కానీ, లాక్డౌన్ కారణం దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 22న కొమరం భీమ్ రాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొమరం భీమ్ లుక్‌ను, టీజర్‌ను ఆరోజు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రాధేశ్యామ్`కి సంబంధించిన టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్ళింది చిత్ర యూనిట్. యూరప్ బ్యాక్ డ్రాప్లో 1960, 1970 దశకాలలో జరిగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో అప్పటి అట్మాస్ఫియర్‌ను తలపించే విధంగా భారీ సెట్ వేశారు. ఇప్పుడు దానికి సంబంధించి షాట్స్‌ను తీసేందుకు ఒరిజినల్ లొకేషన్‌కి వెళ్ళింది చిత్ర యూనిట్.













