కేసీఆర్ పాత్రలో నటించేదెవరు ?
నిజ జీవిత కథల్ని, సంఘటనలను తెరపైకి తీసుకురావడంలో సిద్ధహస్తుడు రాంగోపాల్‌వర్మ. ఇప్పుడు అలాంటి మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథని సినిమాగా మలచడానికి సమాయత్తం అయ్యారు. ఈ చిత్రానికి టైగర్ అని పేరు ఖరారు చేశారు. ద అగ్రెసివ్ గాంధీ అనే ట్యాగ్ లైన్ జోడించారు. ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అంటూ ఓ సంభాషణ కూడా వదిలారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ కథ సాగబోతోంది. కేసీఆర్ పాత్రలో నటించేదెవరు? అనేది తేలాల్సి ఉంది. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేసే వర్మ, ఇప్పటికే కేసీఆర్ పాత్రకు సరిపోయే నటుణ్ని వెతికిపట్టుకుని తర్ఫీదు ఇస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.













