సరిలేరు దర్శకుడితో మెగాపవర్ స్టార్ రాంచరణ్ చిత్రం?
టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తి అయింది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులు నుండి మంచి స్పందన దక్కించుకున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. కల్పిత పేట్రియాటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం అయింది. కాగా అతి త్వరలో తుది దశకు చేరుకోనున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం తో పాటు మరోవైపు తండ్రి మెగాస్టార్చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు చరణ్. ఆయన ఆ సినిమాలో ఒక పవర్ ఫుల్ విద్యార్థి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇకపోతే దీని అనంతరం చరణ్ నెక్స్ట్ నటించబోయే సినిమాల గురించి ఇప్పటికే డిజిటల్ మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతుండగా నేడు ఆయన తదుపరి సినిమా ఫిక్స్ అయింది అంటూ ఒక వార్త విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇక ఆ వార్తను బట్టి చూస్తే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాని తీయనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల చరణ్ కి ఒక మంచి స్టోరీ లైన్ ని వినిపించిన అనిల్, నిన్న దాని తాలూకు పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి వినిపించి ఆయన ఆమోదం పొందినట్టు చెప్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని, ఈలోపు ఎఫ్ 3 సీక్వెల్ ని అనిల్ తీయనున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం తప్పకుండా తొలిసారిగా చరణ్, అనిల్ ల కలయికలో ఒక సూపర్ హిట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆశించవచ్చు!













