ఆర్ఆర్ఆర్ నుండి… సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. రౌద్రం.. రుణం.. రుధిరం. అలియా భట్, ఓలివియా మోరిస్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు అంటూ ఏడాది కిందట ఎన్టీఆర్ వాయిస్‌తో రామ్‌చరణ్ పాత్రను పరిచయం చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ నెల 27న (శనివారం) చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మరో అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఆర్ఆర్ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు మహోగ్రరూపం అంటూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లునెక్కు పెడుతున్న అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ను చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తోంది. చరణ్ నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మరోవైపు మిలిగిన షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసి, నిర్మాణానంతర కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌లను పరిచయం చేస్తూ వీడియోలను విడుదల చేశారు. సినిమాలో నటించే కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను కూడా అభిమానులతో పంచుకుంటూ ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచుతున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.













