కుదిరితే కేరళ లేకపోతే మారేడుమిల్లి – మళ్లీ షూటింగ్‌కి రెడీ అవుతున్న ‘పుష్ప’
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్స్‌ను నిలిపి వేశారు. మే 31తో లాక్డౌన్ 4.0 ముగియడం, లాక్డౌన్ 5.0ను జూన్ 30 వరకు పొడిగించడం అందరికీ తెలిసిందే. అయితే లాక్డౌన్ కాలంలో అమలవుతున్న కొన్ని నిషేధాలలో కొంత సడలింపునిచ్చారు. అందులో భాగంగా కొన్ని షరతులతో షూటింగ్ చేసుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యలోనే షూటింగులు ఆపేసిన కొంత మంది నిర్మాతలు మళ్లీ తమ సినిమా షూటింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న `పుష్ప` సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని కొంత భాగం కేరళలో షూట్ చెయ్యాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు. అయితే కేరళ ప్రభుత్వం షూటింగ్‌కి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత లాక్డౌన్ విధించడంతో షూటింగ్స్ ను నిరవధికంగా వాయిదా వేశారు.
ఇప్పడు మరోసారి కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. అక్కడ అనుమతి రాని పక్షంలో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ చేసేందుకు నిర్ణయించారు. అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతో అక్కడ షూటింగ్ ప్రారంభిస్తారు. రామ్‌చరణ్‌తో `రంగస్థలం` చిత్రాన్ని రూపొందించి భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ `పుష్ప` చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్‌గా ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను 6 కోట్ల బడ్జెట్‌తో ఎంతో భారీగా చిత్రీకరించారని తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో గతంలో ఆర్య, ఆర్య2 చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా బాబీ సింహా, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, హరీష్ ఉత్తమన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాకీ సంగీతం అందించే సుకుమార్ ఈ సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్‌ను కంపోజ్ చేన్తున్నారు.













