ట్రిపుల్ ఆర్ లో ప్రియమణి?
ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ పైనే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి కనుక. ఒక సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పుడెలా బయటకు వదలాలో అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలీదేమో. ఎన్టీఆర్, చరణ్‌తో స్టార్ కాంబో గా చిత్రాన్ని ప్రకటించటంతోనే ప్రాజెక్టుపై ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసిన జక్కన్న- రెండో షెడ్యూల్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చాడు. హీరోయిన్లుగా కీర్తి సురేశ్, పరిణీతి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సినిమాలో కీలకమైన పాత్ర కోసం ప్రియమణి వైపు జక్కన్న ఫోకస్ పెట్టాడని ఇప్పటికే వినిపించాయి. తాజాగా ఆమెతో సంప్రతింపులు జరుగుతున్నట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం సముద్రఖని పేరు వినిపించటం, ఆ తరువాత జక్కన్న ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ప్రియమణితో సంప్రదింపులు మొదలయ్యాయని వార్తలొస్తున్నాయి. జక్కన్న సినిమా అంటే ప్రియమణి నో చెప్పే అవకాశం ఉండకపోవచ్చనీ అంటున్నారు. గతంలో రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన యమదొంగ చిత్రంలో ప్రియమణి లీడ్‌రోల్ చేయడం తెలిసిందే.













