ప్రభాస్ సినిమాకి కూడా అది తప్పేలా లేదు
రెండు నెలలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల అన్ని రంగాలకూ నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగానికి తీరని నష్టం జరుగుతోంది. ఓ పక్క డబ్బు పెట్టిన నిర్మాత సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నష్టాల్లో కూరుకుపోతున్నాడు. మరోపక్క సినిమానే నమ్ముకున్న కార్మికులకు పని లేక నానా అవస్థలు పడుతున్నారు. జూన్ మొదటి వారంలో షూటింగులు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే షూటింగులు చేసుకోవడానికి ఎన్నో ఆంక్షలు విధించబోతున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌తో ఇప్పటికే విదేశాల్లో కొంతభాగం షూటింగ్ జరుపుకున్న సినిమాలపై ఈ ఆంక్షల ప్రభావం బాగా పడే అవకాశం ఉంది. కొత్త ఆంక్షల ప్రకారం విదేశాల్లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు లేవు. ఇండియాలోని గ్రీన్ జోన్లలో మాత్రమే షూటింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇండియాలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు. ఇప్పటికే కొంత భాగం తీసి ఉండడం వల్ల ఇప్పుడు తీసే షాట్స్ వాటికి మ్యాచ్ అవ్వాలి. అలా అవ్వాలంటే అక్కకికే వెళ్లి తియ్యాలి. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో ఆ లొకేషన్లను సెట్స్‌గా వేసే ఆలోచన చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రాజమౌళి పూణె సెట్స్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ డియర్ చిత్రం షూటింగ్ ఇప్పటికే విదేశాల్లోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ చెయ్యాలంటే ఇక్కడే సెట్స్ వెయ్యక తప్పదు. ఆ దిశగా చిత్ర యూనిట్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.













