నా విషయంలో అదే జరిగింది : నయన్
విఫల ప్రేమజ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. బలహీన హృదయులు వాటి తాలూకు మనోవేదనతో కుమిలిపోతుంటారు. జీవితంలో ఏమాత్రం రాజీపడని మనస్తత్వం ఉన్నవారు మాత్రం అపజయాల్ని పాఠాలుగా తీసుకొని భవిష్యత్తును మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటారు. తాను రెండో కోవకు చెందిన మహిళనని చెబుతోంది అగ్ర నాయిక నయనతార. ఈ భామకు గతంలో శింబు, ప్రభుదేవాలతో విఫల ప్రేమ అనుభవాలున్నాయి. తన లవ్ఫెయిల్యూర్ గురించి ఆమె మాట్లాడుతూ స్త్రీ పురుషుల బంధంలో అన్నింటికంటే ప్రధానమైంది నమ్మకం. పరస్పర విశ్వాసంలేని ప్రేమలు ఎక్కువ కాలం నిలబడలేవు. నా విషయంలో అదే జరిగింది. నమ్మకం లేకుండా కలిసి జీవించలేనని విడిపోయాను. ఆ సమయంలో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి సినిమాలే తోడ్పడ్డాయి. కెరీర్ మీదున్న ప్రేమే నన్ను ఆ కష్టాల నుంచి బయటపడేసింది. ప్రస్తుతం గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్తో ప్రేమలో ఉంది. త్వరలో వీళ్లిద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.













