విఎఫ్ఎక్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ అనుమానాలు
భోళా శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల కిందటే స్టార్ట్ అయింది. మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి, తర్వాత భీమవరంలో కొన్ని సీన్స్ ను తెరకెక్కించారు.
తాజాగా మొదలైన షెడ్యూల్ లో మెగాస్టార్ చిరూ కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమాలో 70% పైగా సీన్స్ విఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ చెప్పాడు. విఎఫ్ఎక్స్ వర్క్స్ అంటే అంత ఈజీగా అయిపోవు. దాని కోసం చాలానే టైమ్ పడుతుంది. అయితే విశ్వంభర వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.
ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ కు ముందే విశ్వంభర విఎఫ్ఎక్స్ వర్క్ ను పూర్తి చేస్తుందా అనే అనుమానాలు మెగా ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. సరిపడా టైమ్ తీసుకుని విఎఫ్ఎక్స్ ను బాగా చేయిస్తారా లేక సాదాసీదా వీఎఫ్ఎక్స్ తో నడిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఫాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.













