మహేష్-రాజమౌళి సినిమాలో నేను లేను: సత్యరాజ్
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయనున్న పాన్ వరల్డ్ మూవీ కోసం భారతీయులే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నటించే ఆర్టిస్టుల గురించి నెట్టింట రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేష్29లో బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ పేరు వినిపిస్తోంది.
బ్రహ్మోత్సవంలో మహేష్ తో కలిసి మొదటిగా నటించిన సత్యరాజ్, ఈ సినిమా కోసం మరోసారి మహేష్ తో కలిసి పని చేయనున్నాడని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సత్యరాజ్ తేల్చి చెప్పాడు. ఈ సినిమా కోసం ఇప్పటివరకు తనను ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ తనను అడిగితే హ్యాపీగా ఓకే చెప్తానని సత్యరాజ్ తెలిపాడు.
ఇక బాహుబలికి ముందు తమిళనాడు వరకు తాను సత్యరాజ్ గానే తలుసని, కానీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి తాను కట్టప్పగా గుర్తిండిపోయానని, ఇందుకు రాజమౌళికి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సత్యరాజ్ తెలిపారు. అంతేకాదు తాను మోడీ బయోపిక్ లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో కూడా వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశాడు. తాను, మోడీ చూడ్డానికి కాస్త దగ్గరగా అనిపిస్తామని, అందుకే ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టి ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారన్నాడు.













