Kangana Ranaut: పనికిమాలిన ట్రోఫీల కంటే ఈ చీరే గొప్పది
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా నటి కంగనా రనౌత్(Kangana Ranaut) నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ (Emergency). ఎన్నో వివాదాలు ఎదుర్కొని, ఎన్నో సమస్యల తర్వాత ఆ సినిమా జనవరి 17న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ రెస్పాన్స్ ను అందుకుంది. ఎమర్జెన్సీ సినిమాపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, కంగనా మాత్రం ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందాయని చెప్తూనే ఉంది.
ఎమర్జెన్సీ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాను ఓటీటీలో చూసిన నిత్యానందం(Nithyanandham) అనే వ్యక్తి ఆ సినిమా చూశాక కంగనాను మెచ్చుకుంటూ ఓ లెటర్ రాశారు. ఎమర్జెన్సీ లాంటి పవర్ఫుల్ సబ్జెక్టును ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో ధైర్యంగా తీసినందుకు కంగనాని మెచ్చుకుంటూ ఓ లేఖ రాస్తూ ఆ లెటర్ తో పాటూ ఓ కాంచిపురం చీరను కూడా ఆమెను గిఫ్టుగా పంపాడు.
ఈ విషయాన్ని కంగనా ఇన్స్టాలో షేర్ చేస్తూ ఎమర్జెన్సీ మూవీ తీసినందుకు తనకు అద్భుతమైన శారీ గిఫ్టుగా వచ్చిందని, పనికిమాలిన ఎన్నో అవార్డుల కంటే ఈ చీర ఎంతో బెటర్ అని కంగనా ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది. బాలీవుడ్ లో ఇచ్చే పలు అవార్డులపైనే కంగనా ఈ కామెంట్స్ చేసిందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో కూడా కంగనా బాలీవుడ్ లో అర్హత ఉన్న వారికి ఎప్పుడూ అవార్డులు ఇవ్వరని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.













