రజనీకాంత్ కీలకంగా మారనున్నారా? మద్దతు కోసం కలిసిన కమల్?
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాట కొత్త పరిణామం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్‌హసన్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ జరిగింది. తాను రాజకీయాల్లోకి రావడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన మద్దతు కోసమే కమల్ ఆయనతో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అనారోగ్యం నుంచి కోలుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే సూపర్‌స్టార్‌ను కమల్ కలిశారన్నది మరో వాదన. ఆదివారం కమల్‌హసన్ విస్తృత స్థాయిలో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారానే పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా మక్కల్ నీది మయ్యమ్ నేత మణి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ‘‘ఒకవేళ రేపటి రోజున రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటిస్తే… మేం వారితో కలిసి ప్రయాణం చేస్తాం. ఒకవేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోతే.. వారికి అనుబంధ సంస్థగా కూడా కొనసాగుతాం. అందులో ఎలాంటి మార్పూ ఉండదు.’’ అని మణి తేల్చి చెప్పారు.
కీలకం కానున్న సూపర్ స్టార్
తాను రాజకీయాల్లోకి రావడం లేదని సూపర్ స్టార్ అధికారికంగా ప్రకటించేశారు. దీంతో రాజకీయాల్లో ఆయన డిమాండ్ బాగా పెరిగిపోయింది. రజనీకాంత్ లోలోపల బీజేపీకి మద్దతుదారు అని అందరూ భావిస్తున్నా… అందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. బీజేపీకి మద్దతివ్వాలని బాహాటంగా ఎక్కడా తన అనుచరులకు పిలుపు ఇవ్వలేదు. పైగా ఎలాగూ రాజకీయాల్లోకి కూడా రావడం లేదు. దీంతో రజనీ మద్దతు కోసం అందరూ క్యూ కడుతున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటించగానే రజనీ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఒక్కో పార్టీలోకి వెళిపోతున్నారు. అది వారిష్టమని, నేనెవర్నీ ఆపనని, అది వారి వారి స్వేచ్ఛ అని రజనీ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. మరో రెండు రోజుల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున పోటీ చేయాలని భావించే వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కమల్ పిలుపునిచ్చారు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. మద్దతుదారులను తమ పార్టీ నుంచి బరిలోకి దిగాలని ఓ మాట చెప్పాలని రజనీతో కమల్ చెప్పారా? అన్నది ఆలోచించాల్సిన అంశం. సైద్ధాంతికంగా కమల్, రజనీ మధ్య విభేదాలున్నా… వారు మాత్రం మంచి స్నేహితులుగానే కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కమల్ రజనీని కోరినట్లు వార్తలొస్తున్నాయి.
గతంలోనూ ప్రకటించిన కమల్
సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఖాయమైన సందర్భంలో కూడా పొత్తుపై కమల్ హసన్ వ్యాఖ్యానించారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, అయితే రజనీకాంత్ స్థాపించబోయే పార్టీతో మాత్రం పొత్తుకు రెడీ అని కమల్ గతంలో ప్రకటించారు. అయితే రజనీ సిద్ధాంతాలకు, తన సిద్ధాంతాలకు హస్తిమశకం తేడా ఉందని, అయితే తామిద్దరం మంచి మిత్రులమని పేర్కొన్నారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా? అన్నది మాత్రం రజనీ నిర్ణయాలపై ఆధారపడతాయని తెలిపారు. అయితే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రజనీకాంత్ తమకే మద్దతివ్వాలని బహిరంగంగానే కోరారు.













