Ustaad Bhagath Singh: ‘దేఖ్లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్
24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించిన ‘దేఖ్లేంగే సాలా’
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్లేంగే సాలా’ విడుదలై శ్రోతలను ఉర్రుతలూగిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించి, తక్షణ హిట్ గా నిలిచింది.
దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఎంతో ఆకర్షణీయంగా ఉండి, సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే, పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ సమకూర్చిన నృత్యరీతులు కూడా భారీ ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇక ప్రేరణాత్మకమైన, వాణిజ్యపరమైన అంశాల కలయికలో భాస్కరభట్ల రాసిన సాహిత్యం పాట విజయంలో కీలక పాత్ర పోషించింది.
‘దేఖ్లేంగే సాలా’ పాటతో పవర్ స్టార్ అభిమానులకు హరీష్ శంకర్ విందు:
‘దేఖ్లేంగే సాలా’ పాట ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంగీతం విషయంలో ఆయనకు మంచి అభిరుచి ఉంది. హరీష్ శంకర్ గత చిత్రాలలోని పాటలు వింటే ఆ విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని పాటలు ఎంతటి ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఆ తరహా పాటలలో, ఆ తరహా నృత్యంతో చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. వారి కోరికను నెరవేర్చడానికి ‘దేఖ్లేంగే సాలా’ పాటకు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్. ఆయన కృషి ఫలితంగానే ఈ పాట అభిమానులకు విందు భోజనంలా మారి, ఇంతటి ఆదరణ పొందుతోంది.
ఈ పాట విజయానికి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ల అవిశ్రాంత కృషి కూడా కారణమని చెప్పవచ్చు. వీరందరూ సమిష్టిగా పనిచేసి ఒక ఉత్సాహభరితమైన మరియు దృశ్యపరంగా అద్భుతమైన అనుభవాన్ని సృష్టించారు.
‘దేఖ్లేంగే సాలా’ వెనుక ఉన్న బృందం నిజంగా మరపురాని అనుభవాన్ని అందించింది. ఈ అద్భుతమైన విజయం పట్ల అన్ని వర్గాల నుంచి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.






