ఖచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటా
కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉండగానే ప్రేమ పెళ్లి చేసుకుంది హీరోయిన్ అమలాపాల్. అయితే ఈ పెళ్లికి నిండా రెండేళ్లు గడవకుండానే బ్రేకప్ చెప్పేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయాలనే అమలాపాల్ పట్టుదలే ఇందుకు కారణం అన్నట్లుగా భర్త తరపున కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ వచ్చాయి. వీటిపై పెద్దగా స్పందించని ఈ భామ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిపోయింది. తాజాగా ఆమెకు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమనిస్తూ.. నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా? ఖచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటా. తప్పనిసరిగా ప్రేమ పెళ్లినే చేసుకుంటా అని ఖరాఖండీగా చెప్పింది అమలాపాల్. మొదటి పెళ్లి కూడా ప్రేమించి చేసుకున్నదే అయినా అది విఫలమైంది. ఇప్పుడు రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతోందంటే అమలాపాల్‌కు ప్రేమపై ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తుంది.













