‘పుష్ప’ సినిమా షూటింగ్ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్న సుకుమార్?
కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాలకు చెందిన పనులకు ఆటంకం కలుగుతోంది. అంతకుముందు అనుకున్న ప్రణాళికలో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కథ ప్రకారం ఒక ప్రత్యేకమైన లొకేషన్లో షూటింగ్ చేయాలనుకుంటారు. అవసరం అనుకుంటే విదేశాలలో కూడా ప్లాన్ చేసుకుంటారు. అలా చేసిన చాలా సినిమాలు ఇప్పుడు అయోమయంలో పడ్డాయి. కొంతమంది దర్శకులు తాము ఎక్కడైతే తియ్యాలనుకున్నారో దాన్ని యధాతథంగా సెట్స్ వేసి లాగించెయ్యాలనుకుంటున్నారు. మరికొందరు దానికి ప్రత్యామ్నాయంగా మరో లొకేషన్‌కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న `పుష్ప` విషయంలో అదే జరుగుతోంది.
మొదట ఈ సినిమా కథ ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం, చిత్తూరులోని శేషాచలం అడవుల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అక్కడ షూటింగ్ చేయలేకపోతున్నారు. దాంతో హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌ను ఎంచుకొని సెట్స్ వేసి షూటింగ్ చేయాలని భావించాడు సుకుమార్. అయితే తాజాగా తన షూటింగ్‌ను వికారాబాద్ అడవుల్లో తీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సుకుమార్ షూటింగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం మరో నెలపాటు వెయిట్ చేసి ఆ తర్వాత షూటింగ్ పెట్టకుంటే బాగుంటుందని సుకుమార్‌కి సూచించినట్టు సమాచారం. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో `పుష్ప` సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్ని లుక్ కూడా డిఫరెంట్ ఉండడంతో రంగస్థలంలా ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని సినీవర్గాలు భావిస్తున్నాయి.













