Micky J Mayor: ‘ఛాంపియన్’ సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇచ్చింది: మిక్కీ జే మేయర్
ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ మూవీ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఛాంపియన్ ప్రీ ఇండిపెండెన్స్ టైం లో జరిగే కథ.. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం ఎలా అనిపించింది?
-ఇండిపెండెన్స్ సమయంలో జరిగే కథలు ఇప్పుడు వరకు చాలానే వచ్చాయి. ఆ చిత్రాల్లో బ్రిటీషర్స్ తో జరిగిన పోరాటాన్ని చూపించడం జరిగింది. కానీ ఛాంపియన్ చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఎక్కువగా నిజాం బ్యాక్ డ్రాప్ ఉంటుంది. నిజాం కాలంలో గ్రామాలు, ప్రజలు, ఎమోషన్స్ ని చాలా విభిన్నంగా చూపించడం జరిగింది.
పీరియడ్ సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక టైం నుంచి మరో టైం లోకి వెళ్లి ఒక కాలాన్ని చూడడమనేది ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. మహానటి సినిమా కూడా అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమానే.
-ఛాంపియన్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్ ని మిళితం చేసి ఒక జానెర్ క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఇలాంటి మ్యూజిక్ క్రియేట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి
డైరెక్టర్ ప్రదీప్ గారు ఈ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
-డైరెక్టర్ ప్రదీప్ ఈ కథని నాకు ఫోన్ లో చెప్పారు. అయినా కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అనిపించింది. ఈ కథ ఐడియా చాలా యూనిక్ గా ఉంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఐడియాతో ఇప్పటివరకు ఎవరు సినిమా చేయలేదు అనిపిస్తుంది.
-ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమానే గాని కథపరంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో హీరోది సికింద్రాబాద్. ఆయన మాట్లాడే స్లాంగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను కూడా సికింద్రాబాద్ లోనే పెరిగాను. నాకు ఆ కల్చర్ పై అవగాహన వుంది.
గిరగిర పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా.. ఆ సిచువేషన్ గురించి చెప్పండి?
– ఆ పాటకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అది మంచి కమర్షియల్ సాంగ్. నిజానికి హీరో ఇంట్రో సాంగ్ అది. మంచి మెలోడీ. మంచి బీట్ కూడా ఆడ్ అవ్వడంతో చాలా కొత్త ఫ్లేవర్ వచ్చింది.
– రోషన్ ఆల్ రౌండర్. తను తను మంచి యాక్టర్ డాన్సర్. ఆ సాంగ్‌లో తను చేసిన డ్యాన్సులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సాంగ్ ని కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని ఉద్దేశంతో చేశాం. అది అలాంటి సక్సెస్ ని అందుకుంది.
– సల్లంగుండాలి పాట కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది నా జోనర్ సాంగ్. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇంకో రెండు రిలీజ్ కాబోతున్నాయి.
నిజానికి మీరు మిస్టర్ బచ్చన్ తోనే కమర్షియల్ గా ప్రూవ్ చేసుకున్నారు కదా?
-నాకు ఏది ప్రూవ్ చేసుకోవాలని ఉండదు. నాకు ఏ ప్రాజెక్టు వస్తే ఆ ప్రాజెక్ట్, ఆ జానర్ కి తగ్గ మ్యూజిక్ చేయాలనుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ చేశాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. దాదాపుగా ఒక 50 సినిమాలు చేసి ఉంటాను. ఇంకో పది చేస్తే రిటైర్ అయిపోవచ్చు (నవ్వుతూ)
ఈ కథలో లవ్ ట్రాక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా వుంటుంది?
-ఇది చాలా ప్రత్యేకమైన కథ. రెగ్యులర్ లవ్ ట్రాక్ ఉండదు. ఈ సినిమాల్లో ఒక మంచి మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ కి సంబంధించి ఒక మంచి సాంగ్ కూడా చేశాం. చాలా హాంటింగ్ మెలోడీ.
-ఒక సాంగ్ చేసిన తర్వాత అది జనాల్లోకి ఎలా వెళ్తుంది అనే ఒత్తిడి మీ మీద ఉంటుందా? అలాగే ఇప్పుడు రీల్స్ ట్రెండ్ తగ్గట్టు మీరు మ్యూజిక్ చేస్తుంటారా?
ఒక సాంగ్ ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? అనేది మన చేతిలో ఉండదు. ఈ అలాంటి ఒత్తిడి లేదు. ఇప్పటివరకు నేను రీల్స్ కు సంబంధించి కూడా ప్రత్యేకంగా మ్యూజిక్ చేసింది లేదు. ఒక పాట ఆడియన్స్ కి నచ్చితే ఏ పార్ట్ ని రీల్స్ చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే ఈ విషయంలో నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోను.
ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
-ఇలాంటి సాంగ్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఇందులో ప్రతి సిచువేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. మీకు విజువల్ గా కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక కొత్త మ్యూజిక్ ని క్రియేట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.
స్వప్న సినిమాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-వాళ్ల జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అశ్విని దత్ గారు చాలా అనుభవం ఉన్న నిర్మాత. ఆయన ప్రతి సాంగ్ ని వింటారు. ఆయనకి మ్యూజిక్ పట్ల ఉన్న అభిరుచి అద్భుతం. ఆయన సజెషన్స్ నాకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మీ కెరీర్ పట్ల ఆనందంగా ఉన్నారా?
-చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంచి ఆల్బమ్స్ ఇచ్చాను. బాలు గారు, సీతారామశాస్త్రి గారు, వేటూరి గారు లాంటి లెజెండ్స్ తో కలిసి పని చేశాను. శేఖర్ కమ్ముల గారు, హరీష్ శంకర్, శ్రీనువైట్ల గారు, శ్రీకాంత్ అడ్డాల గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలా ఎంతో మంది డిఫరెంట్ క్రియేటర్స్ తో కలిసి పని చేశాను. నా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను.






