Trump Gold Card: గోల్డ్ కార్డ్ కొనండి.. అమెరికా ఫ్లైట్ ఎక్కేయండంటున్న ట్రంప్..
US: అమెరికా పౌరసత్వం కావాలని కోరుకుంటున్న సంపన్నులకు బంపరాఫర్.. అమెరికా అధ్యక్షుడు పౌరసత్వం కోరుకునే వారికోసం గోల్డ్ కార్డ్ (Gold Card)’ను ప్రారంభించారు. ఈ స్కీమ్ లో 1 మిలియన్ డాలర్లు చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చు. వైట్‌హౌస్‌లోని కొందరు వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ దీన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశారు.
1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. అయితే, ఈ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ చెప్పారు. దీని స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రకటించారు. ఈ స్కీమ్.. సంవత్సరాలు సమయం తీసుకొనే నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం కల్పిస్తోందన్నారు. ఈ కొత్త వెబ్సైట్ నిమిషాల్లోనే దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందన్నారు. ఈ గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు 1 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కంపెనీలు తమ ప్రతిభావంతులను ఇక్కడ ఉంచేందుకు 2 మిలియన్ డాలర్లు చెల్లించవచ్చన్నారు. ‘మన దేశంలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయం. భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చు’ అని అన్నారు.
వీసా వ్యవస్థను సరిచేయాలంటూ తనపై ఒత్తిడి చేసిన వ్యాపారవేత్తల గురించి ట్రంప్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసా అనిశ్చితుల కారణంగా కంపెనీలు అత్యంత ప్రతిభావంతులను కోల్పోవాల్సి ఉంటుందని కుక్ తనతో చెప్పారన్నారు. తాజా కార్యక్రమంతో అమెరికా ఖజానాకు బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చి పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక, వైట్‌హౌస్ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ గ్రీన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.






