కెనడా, అమెరికా సరిహద్దులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దు కరోనాతో మూతపడింది. అమెరికా, కెనడా మధ్య ఉన్న సరిహద్దును వచ్చే ఏడాది జనవరి 21 వరకు మూసేస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి సరిహద్దు మూసివేతను మరికొంతకాలం కొనసాగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. కాగా, కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి గత మార్చి నెలలోనే ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను మూసివేశారు. అయితే ప్రతి నెల దానిని పొడిగిస్తూ వస్తున్నారు. అత్యవసర వాహనాలు, సరుకు రవాణాకు మాత్రమే అనుమతిస్తున్నారు.
కెనడాలో రెండో దశ కరోనా విజృంభిస్తున్నది. ఒకేరోజు దేశంలో 4,50,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో మరోమారు కరోనా విలయతాండవం చేస్తుండటంతో మెక్సికో కూడా సరిహద్దులను మూసివేసింది. ఇది జనవరి 21 వరకు అమల్లో ఉంటుందని మెక్సికో హోం మంత్రి చాద్ ప్రకటించారు. కరోనాను నిలువరించడంలో భాగంగా అమెరికా, కెనడా, మెక్సికో సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించాయని చెప్పారు. నిత్యావసరాల రవాణాకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.






