పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వీ హబ్ ఆధ్వర్యంలో ‘విమెన్ ఇన్ జర్నలిజం లీడర్షిప్ యాక్సిలరేటర్’ ప్రోగ్రామ్ను ప్రారంభించబోతున్నాం అని అన్నారు. ఎవరైనా ఔత్సాహికులు ముందుకు రావాలనుకుంటున్నారో.. మెరుగ్గా, సమర్థవంతంగా, వినూత్న ఆలోచనలను అర్థవంతంగా నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకోవాలనుకునే వారి కోసం యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నాం అని అన్నారు. సీనియర్ జర్నలిస్టులు వీ హబ్లో భాగస్వాములు కావాలి. సీనియర్ మహిళా జర్నలిస్టులు తమ అనుభవాలు, ఆలోచనలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైనా సవాళ్లను కొత్త తరం జర్నలిస్టులతో పని చేసేందుకు వీ హబ్తో పని చేయాలి. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.













