Bhatti Vikramarka: అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు :డిప్యూటీ సీఎం భట్టి
రెండేళ్ల పాటు ఫామ్ హౌస్ లో నిద్రపోయి నిన్న, మొన్న బయటకొచ్చి తోలు వలుస్తామని బెదిరిస్తున్న పెద్దాయన, ఆ ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నాడో చెప్పాలంటూ మాజీ సీఎం కేసీఆర్పై (KCR) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా (Khammam district) తల్లాడ మండలం పినపాకలో రూ.10.53కోట్లతో నిర్మించనున్న పినపాక, అన్నారుగూడెం, లింగాల విద్యుత్ సబ్స్టేషన్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పినపాకలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పది మందిని పక్కన కూర్చోబెట్టుకుని తోలు వలుస్తాం, తాట తీస్తాం అని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాసనసభకు రావడానికి కేసీఆర్కు ఎందుకంత భయమని, అసెంబ్లీ (Assembly)కి రాని వ్యక్తికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని ప్రశ్నించారు. రెండేళ్ల తర్వాత పెద్దాయన బయటకొచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆశీర్వదిస్తారని అనుకుంటే, ఇలా అవాకులు చవాకులు పేలారని విమర్శించారు.






