హైదరాబాద్ లో స్టూడెంట్ వీసా డే
అమెరికా యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు నేటికీ మొదటి గమ్యస్థానంగా కొనసాగుతోందని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడా అన్నారు. చైనా తర్వాత భారతీయ విద్యార్థులు అధికంగా అమెరికాలో చదువుకుంటున్నారని ఆమె తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల ప్రయోజనార్థం కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో స్టూడెంట్ వీసా డే నిర్వహించారు. భారత్, అమెరికా మధ్య విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి స్టూడెంట్ వీసా డే దోహదపడుతుందని కేథరిన్ చెప్పారు.
హైదరాబాద్లో సుమారు 800 మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. స్టూడెంట్ వీసా డే సందఠంగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో దాదాపు 4 వేల మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నట్టు కేథరిన్ తెలిపారు. ఈ సందఠంగా అమెరికా వెళ్లడానికి వీసాలు సాధించిన విద్యార్థులకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మేరీ కే కార్ల్సన్, ఆయా కేంద్రాల్లోని కాన్సుల్ జనరళ్లు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో విద్యార్థులకు కేథరిన్ హడా వీసాలు అందజేశారు. అమెరికా వెళ్లిన తర్వాత విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు.













