సీఎస్ జోషీతో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ తెలిపారు. అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ బీఆర్కేభవన్లో సీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యూఎస్ కాన్సులేట్ భవన నిర్మాణం పరిస్థితిపై ఇరువురు చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ముఖ్యంగా సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు. విద్య, వైద్య, ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో సహకారం అందిపుచ్చుకోవడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణతో అమెరికా స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని ఆశించారు. ఈ సందర్భంగా అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రిఫ్మన్ మాట్లాడుతూ అమెరికా, తెలంగాణ స్నేహపూర్వక మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామని చెప్పారు.













