చార్మినార్ ను సందర్శించిన అమెరికా రాయబారి
అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్, అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ బీ హడ్డాతో కలిసి హైదరాబాద్‌లోని పాతనగరాన్ని సందర్శించారు. చారిత్రక నగరి హైదరాబాద్ సొబగులను ఆస్వాదించారు. తొలుత చార్మినార్‌తో పాటు మక్కామసీదును, అనంతరం కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను పరిశీలించి వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. 17వ శతాబ్ధానికి చెందిన కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో యూఎస్ అంబాసిడర్స్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిసర్వేషన్ (ఏఎఫ్‌సీపీ) నుంచి 70 లక్షల గ్రాంట్‌ను అగాఖాన్ ఫౌండేషన్‌కు అందనుంది. కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణ కోసం ఏఫ్సీసీ ప్రకటించిన ఈ ఆర్థిక సాయం రెండోసారి కావటం విశేషం.
ఈ సందర్భంగా అమెరాకా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ బీ హడ్డా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాల సమాహారమని కొనియాడారు. చార్మినార్ సమీపంలో పాదచారుల జోన్ ప్రాజెక్ట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిది వద్ద సేదతీరుతూ ఇరానీచాయ్ రుచిని ఆస్వాదించారు. అమెరికా రాయబారి పాతనగర పర్యటనా అద్యంతం కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగింది. చార్మినార్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ అంజయ్యతో పాటు ట్రాఫిక్ ఏసీపీ నాగన్న భద్రతాచర్యలను పర్యవేక్షించారు. ఆమె వెంట తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, అగాఖాన్ ఫౌండేషన్ సీఈవో రతీశ్నందా తదితరులున్నారు.













