కవితకు ఈడీ నోటిసులిస్తే తప్పేంటి ? .. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈడీ నోటీసులతో మాకు సంబంధం లేదు. చట్టం ముందు అందరూ ఒక్కటే. కవితకు ఈడీ నోటీసులిస్తే తప్పేంటి? దర్యాప్తు సంస్థల విషయంలో మేము జోక్యం చేసుకోము. అవినీతి అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెట్టి రెచ్చగొడుతున్నారు. ఈడీ కేసు విషయంలో నీతిమంతులైతే గగ్గోలు ఎందుకు పెడుతున్నారు? కవితను తలవంచమని ఎవరు చెప్పటం లేదు. తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబం ఒక్కటేనా?. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
ఢిల్లీ వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసింది, సెల్ ఫోన్ ఫోన్లు పగల కొట్టింది, అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తమ తప్పిదాలు, అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం నాటకాలు చేస్తోంది. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేసి నిత్యం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వం నిర్భంధంలో ఉన్నారు. వారికి స్వేచ్ఛ లేదు. మహిళ అనే గౌరవం లేకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శాసనసభ ప్రగతిభవన్ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శలు చేశారు.













