నేరేడ్మెట్ లో టీఆర్ఎస్ గెలుపు …
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని నేరేడ్మెట్ ఫలితం వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 668 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపోందారు. జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన ఈ నెల 4వ తేదీనే నేరేడ్మెట్ డివిజన్ లెక్కింపు చేపట్టారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నప్పటికీ ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ డివిజన్ ఫలితాన్ని ప్రకటించలేదు.
తాజాగా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించడంతో నేరేడ్మెట్ డివిజన్లో లెక్కింపును ఈ ఉదయం చేపట్టారు. సైనిక్పూరిలోని భవన్స్ వివేకానంద కళాశాలలో లెక్కింపు కొనసాగింది. ఇతర గుర్తులున్న 544 ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఇంతకుముందు ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు.













