గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు…బలం పెంచుకున్న బిజెపి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు తగ్గింది. బిజెపి జోరు పెరిగింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు టీఆర్ఎస్ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా…నేనా అన్నరీతిలో గట్టి పోటీని ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ముందుగా వచ్చిన అంచనాల ప్రకారమే టీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ నిలవనున్నది. టీఆర్ఎస్ మొత్తం 150 సీట్లలో 60కిపైగా సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గినా ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎంకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా హైదరాబాద్‌లో ప్రచారం చేయడంతో ఉత్తర ఇండియన్స్‌లో ఇది కొంత ప్రభావం చూపించింది. కాగా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైపోయింది.













