ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
ఫేమ్ ఇండియా ఏషియా మేగజైన్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును టీఆర్ఎస్ ఎంపీ కవిత అందుకున్నారు. శ్రేష్ఠ సంసద్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పురస్కారాన్ని బహుకరించారు. దేశవ్యాప్తంగా 25 ఎంపీలను ఎంపిక చేసిన ఈ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి కవిత ఒక్కరే ఎంపికవడం విశేషం. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవ, ప్రజాదరణ, కార్యశీలత అంశాల్లో కవిత రాణించారని ఫేమ్ ఇండియా సంస్థ ప్రశంసించింది. కవితను అభినందించడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. అవార్డు ప్రదానోత్సవంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, సంతోశ్, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న అనంతరం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశీస్సులు తీసుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల దీవెనతోనే అవార్డు వచ్చిందంటూ ఎంపీగా ఎనుకున్న నిజామాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు.













