గ్రేటర్ వరంగల్ మేయర్ గా గుండు సుధారాణి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా గుండు సుధారాణిని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఖారారు చేసింది. డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పరిశీలకులుగా వెళ్లిన మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ కలిసి ప్రకటించారు. గుండు సుధారాణి 29వ వార్డు నుంచి గెలుపొందగా, రిజ్వానా 36వ వార్డు నుంచి గెలుపొందారు. అయితే వీరిద్దరితో ప్రత్యేక అధికారి సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ స్థానానికి గుండు సుధారాణి పేరును ఇండ్ల నాగేశ్వర రావు ప్రతిపాదించగా, వస్కుల బాబు బలపరిచారు. డిప్యూటీ మేయర్ స్థానానికి రెజ్వినా పేరును సుంకరి మనీషా ప్రతిపాదించగా, రంజిత్ రావు బలపరిచారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు కార్పొరేటర్లకు గుండు సుధారాణి ధన్యవాదాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. సమగ్ర ప్రణాళికతో వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.