వాళ్ల ఓట్లను వెంటనే తొలగించండి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మందికి తెలంగాణలోనూ ఓట్లున్నాయని, ఆ ఓట్లను వెంటనే తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమందికి కూడా హైదరాబాద్‌లో ఓట్లు ఉన్నాయని, వాటిని కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, కానీ హైదరాబాద్‌లో బోగస్, డూప్లికేట్ ఓట్లతో పాటు మరణించిన వాళ్లకు కూడా ఓట్లున్నాయని, అలాంటి ఓట్లను చెక్ చేసి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గతంలోనే తాము ఈసీ దృష్టికి తీసుకువచ్చామని, కానీ ఇప్పటికీ ఆ సమస్య పూర్తిగా తీరలేదని నిరంజన్ అన్నారు. ‘‘వెంటనే ఆంధ్ర, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు వేసిన వాళ్లకు హైదరాబాద్‌లో ఓటును తొలగించాలి. త్వరలో గ్రామ పంచాయితీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అందువల్ల ఎలక్షన్ కమిషన్ వెంటనే అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలి. డబుల్, బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు తొలగిస్తేనే రానున్న లోకల్ ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా అడ్డుకోగలం’’ అని నిరంజన్ పేర్కొన్నారు.