హైడ్రా దూకుడు..!! రేవంత్ కు టాలీవుడ్ బాసట..!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది అంచనా వేశారు. హైకమాండ్ ఆయనకు పూర్తి అండదండలు అందిస్తున్నా ప్రభుత్వాన్ని నడపడం ఆషామాషీ కాదనుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లున్నారు. అందరూ ముఖ్యమంత్రి సీటును, పీసీసీ పదవిని ఆశించిన వాళ్లే. అలాంటివాళ్లందరినీ కాదని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి దూకుడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణపై తన మార్క్ చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హైడ్రా. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. దీనికి ప్రభుత్వం పూర్తి పగ్గాలిచ్చింది. దీంతో హైడ్రా జులుం విదిలిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూలుస్తూ భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఇంకెంతమంది భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంటుందోనని అందరూ భయంభయంగా గడుపుతున్నారు.
హైడ్రా కూల్చుతున్న భవనాల్లో బడాబాబులవే ఎక్కువ. దీంతో ఇది ఆరంభ హడావుడి మాత్రమేనని.. రేవంత్ రెడ్డి చల్లబడతారని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు తప్పా ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. హైడ్రా దాదాపు 2 నెలలుగా పనిచేస్తోంది. అయితే నాగార్జునకు చెందిన ఎన్-కన్వెషన్ కూల్చిన తర్వాత ఇది ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ లో కీలక హీరోగా ఉన్న నాగార్జునకు ఇండస్ట్రీ మొత్తం అండగా నిలుస్తుందని.. సీఎం చల్లబడతారని అందరూ భావించారు.
అయితే ఇందుకు వ్యతిరేకంగా టాలీవుడ్ లో పలువురు సీఎం రేవంత్ రెడ్డికి సపోర్టుగా నిలుస్తున్నారు. తాజాగా నాగబాబు, హరీశ్ శంకర్, మధుశాలిని తదితరులు హైడ్రా పనితీరును కొనియాడారు. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. ఇలాంటి ఆక్రమణలను ఎక్కడున్నా వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ నుంచి ఇలా సపోర్టు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చెరువుల చుట్టుపక్కల టాలీవుడ్ తో పాటు పలువురు పారిశ్రామిక వేత్తల ఫాంహౌస్ లు, విల్లాలు ఉన్నాయి. అయినా టాలీవుడ్ లో ఓ వర్గం రేవంత్ కు సపోర్ట్ చేయడం ఆయనకు కొండంత బలాన్ని ఇచ్చినట్లే.!