తెలంగాణ నుంచి తరిమేయాల్సిందే : కేసీఆర్
డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్పరెన్స్‌ను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ. పోలీసు అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు సహకారం తీసుకొని డ్రగ్స్‌ను అరికట్టాలి. అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలి. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు.
నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీం స్పష్టం చేశారు.













