ఏ చట్ట ప్రకారం?: ధరణి పై హైకోర్టు సూటి ప్రశ్న
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత ఆస్తుల వివరాల సేకరణ కార్యక్రమం ధరణికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ ఆస్తుల వివరాల సేకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు సంధించింది. పలు కీలక ఆదేశాలూ ఇచ్చింది.
అసలు ఈ ఆస్తుల వివరాల సేకరణ అనేది ఏ చట్ట ప్రకారం చేపట్టారంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అలాగే ఆదాయం, కులం వంటి వివరాల సేకరణ కూడా ఏ చట్ట ప్రకారం చేస్తున్నారో చెప్పాలంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వ్యవసాయం సంబంధ ఆస్తుల వివరాల సేకరణ సందర్భంగా ఆధార్ వివరాల కోసం ఎవరినీ ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకూ సేకరించిన వ్యక్తిగత ఆస్తుల వివరాలను ఏ థర్డ్ పార్టీకి కూడా అందజేయవద్దని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.













