కరోనా పోయిందన్న భ్రమల్లో ఉంటున్నాం… జాగ్రత్త : శ్రీనివాస రావు
ప్రజల నిర్లక్ష్యంతోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎక్కడికీ పోలేదని, రూపం మార్చుకుంది అంతే అని పేర్కొన్నారు. 7 రోజుల్లో సగటున రోజుకు లక్షా 3 వేల టెస్టులు చేశామని, హైదరాబాద్ సిటీలో 5 కరోనా డెడికేటెడ్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. కరోనా సోకిన 80 శాతం మందికి కరోనా లక్షణాలే ఉండటం లేదని, జనాల్లో నిర్లక్ష్యం బాగా పెరిగిపోయిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే కరోనా వేగంగా వ్యాపిస్తోందని, కరోనా కట్టడి అనేది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. శనివారంతో వ్యాక్సిన్ నిల్వలు పూర్తి అవుతున్నాయని, రాత్రి వరకు 2.70 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 28 లక్షల వ్యాక్సిన్ డోసులు లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. మరోవైపు హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగానే కరోనా వేగంగా వ్యాపిస్తోందని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
బెడ్స్, ఆక్సిజన్ కొరత లేదు : డైరెక్టర్
తెలంగాణలో కోవిడ్ చికిత్సకు పడకలు, మందులు, ఆక్సిజన్‌కు కొరత లేదని శ్రీనివాస రావు తేల్చి చెప్పారు. ప్రస్తుతం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కేవలం 15 -20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందన్నారు. రాబోయే రోజుల్లో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని, కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని భరోసా కల్పించారు.
మహారాష్ట్ర నుంచి ఓ ఉత్సవం కోసం సరిహద్దు జిల్లాకు మార్చి 24 న 20 మంది వచ్చారని పేర్కొన్నారు. అందులో సరిహద్దు జిల్లాకు చెందిన మరో 30 మంది కూడా పాల్గొన్నారని వివరించారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించామని, 5 గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించగా మరో 34 మందికి కరోనా సోకినట్లు తేలిందన్నారు. అలా 34 మందితో 433 మందికి కరోనా వ్యాపించిందని శ్రీనివాస రావు వెల్లడించారు.













