మే తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చే ఛాన్స్ : శ్రీనివాస రావు
కరోనా నివారణకు వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. మే నెలాఖరు వరకూ ప్రజలందరూ అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరించారు. మే తర్వాత కోవిడ్ కాస్త అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాస్కు విధిగా ధరించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేది పెళ్లిళ్లు, పండుగల సీజన్ అని, మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జాగ్రత్తల విషయంలో ప్రజలు అలసత్వంతో ఉండకూడదని సూచించారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 45 లక్షల మందికి టీకా ఇచ్చామని, కరోనా నివారణ కోసం ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని ప్రశంసించారు. కరోనా తీవ్రత పెరగలేదని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలున్న వారికే కరోనా టెస్టులని, విరేచనాలు, జ్వరం, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కోవిడ్ లక్షణాలని, వారు మాత్రం కచ్చితంగా టెస్టులకు రావాలని కోరారు.
కరోనా పరీక్షల నిమిత్తమై గుంపులు గుంపులుగా వెళ్లడం ఏమాత్రం సరికాదని తెలిపారు. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులు తగ్గకపోతేనే టెస్టులకు వెళ్లాలని సూచించారు. పడకలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, మరిన్ని పడకలను పెంచడానికి తాము ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను కలిపి 50 వేల పడకలున్నాయని అన్నారు. మరణాల్లో అత్యధిక శాతం ఆస్పత్రులకు వచ్చే సరికి లేదా ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే వ్యాధి ముదిరి చివరి క్షణంలో ఆస్పత్రులకు రావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్నారని ప్రశంసించారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని ఆయన ప్రకటించారు. మే 1 నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, స్లాట్ బుకింగ్‌కి ఇంకా సమయం ఉందన్నారు.













