తెలంగాణ ఐటీకి కేంద్ర గుర్తింపు
తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తున్నందుకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. వాణిజ్యశాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్స్ రేటింగ్ సిస్టం (ఐపీఆర్‌ఎస్) 2.0 నివేదికను విడుదల చేసింది. తెలంగాణ ఐటీ సెక్టార్‌కు చెందిన మూడు ఇండస్ట్రియల్ పార్కులకు చాలెంజర్స్ రేటింగ్ లభించింది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ ఐటీ పార్క్ మాదాపూర్ ఇందులో ఉన్నాయి. ఇండస్ట్రియల్ పార్కులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు అత్యున్నత పనితీరును కనబర్చుతున్నాయని రిపోర్టులో పేర్కొన్నారు. ఐటీలో తెలంగాణ శరవేగంగా ముందుకు వెళ్తున్నది. ఉద్యోగాల సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల విషయంలో దేశంలోనే ప్రత్యేకతను సాధించింది. మౌలిక సదుపాయల కల్పన, బెస్ట్ కనెక్టివిటీ, ఉత్తమ శాంతిభద్రతలు, వ్యాపార అనుకూల వాతావరణం దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ ఐటీ, ఐటీఈఎస్ రంగం స్థిరమైన వృద్ధిని కొనసాగించింది. జాతీయ సగటుతో పోల్చితే డబుల్ వృద్ధిని నమోదుచేసింది. కేవలం హైదరాబాద్‌కే ఐటీ పరిశ్రమను పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తున్నది.













