కాంగ్రెస్ మేనిఫెస్టో…
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 36 అంశాలను అందులో చేర్చారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. వీటితో పాటు వివిధ ఇతర అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది.
మోడీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారన్నారు ఖర్గే. ఎప్పుడూ ఫార్మ్ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారని.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఖర్గే. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ తాము నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆరు గ్యారంటీలివే..
మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
రైతు భరోసా ప్రతి ఏటా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్
గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.
యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా













