జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ఆహ్వానం..! హాజరైతే సంచలనమే..!!
ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలను తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ తరపునే కాకుండా సినీ ఇండస్ట్రీ తరపున కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించాలనుకుంటున్నారు. దీనికోసం ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో టీడీపీ నేతలు చర్చించారు. అయితే హైదరాబాద్ లో ఈ నెల 20న జరగనున్న శతజయంతి వేడుకలకు టీడీపీ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు హాజరు కావాలని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, సన్నిహితులందరికీ స్వయంగా ఆహ్వానాలు అందిస్తోంది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల బాధ్యతలను తెలుగుదేశం పార్టీ టీడీ జనార్ధన్ కు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకోవడంతో పాటు వాళ్లందరి సహకారంతో ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. దీంతో టీడీ జనార్ధన్ ఈ వేడుకలను సక్సెస్ చేసేందుకు వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. వాళ్ల సూచలనలు పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. రాజకీయపరంగా, సినీ రంగ పరంగా వేర్వేరుగా వేడుకలు నిర్వహించాలని తలపెట్టారు.
ఈ ఏడాది మహానాడు రాజమండ్రిలో జరగనుంది. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు పార్టీ ఏర్పాటు చేస్తోంది. అయితే అది పార్టీ కార్యక్రమం కావడంతో అన్ని వర్గాల వాళ్లూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు. అందుకే హైదరాబాద్ కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ నెల 20న మరో వేడుకను ఏర్పాటు చేసింది టీడీపీ. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. వేడుకల ఇన్ ఛార్జ్ టీడీ జనార్ధన్ స్వయంగా వాళ్ల దగ్గరకు వెళ్లి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
ఇందులో భాగంగా టీడీ జనార్ధన్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరినీ స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించారు. పురంధేశ్వరి – దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా టీడీ జనార్ధన్ ఆహ్వానం అందించారు. ఇన్నాళ్లూ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ పట్టించుకోవట్లేదని, ఆయన్ను తొక్కేస్తోందని అభిమానులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పటికైనా టీడీపీని గట్టెక్కించేంది జూనియర్ ఎన్టీఆరేనని, ఆయన్ను పట్టించుకోకపోతే పార్టీ ఉనికే ఉండదని హెచ్చరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా పార్టీ నుంచి ఆహ్వానం అందింది. మరి ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా..? ఫ్యామిలీతో ఉన్న గ్యాప్ ను తగ్గించుకోగలుగుతారా..? అనేది వేచి చూడాలి.













