ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లపై.. సుప్రీంలో విచారణ
మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తుదివిచారణ చేపట్టాలని ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్ను ధర్మాసనం జతపరిచిన విషయం తెలిసిందే. కవిత సమన్లు తీసుకోవట్లేదని, విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్ సిబల్ అన్నారు. అది ఒక్కసారికే పరిమితమని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ నోటీసులే చట్ట విరుద్ధమన్నది తమ వాదనని కపిల్ సిబల్ అన్నారు. అన్ని విషయాలను 16న జరిగే విచారణలో పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మానం స్పష్టం చేసింది.













