తెలుగు భాష, సంస్కృతి కోసం జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయం అవసరం : సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్.వి.రమణ
దేశంలో సంస్కృత, హిందీ, విదేశీ భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లు, తెలుగు కోసం కూడా జాతీయస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప మనదైన భాష, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప శాసన సభాపతి మండలి బుద్ధప్రసాద్ తన తండ్రి మండలి వెంకట కృష్ణారావు పేరిట నెలకొల్పిన సంస్కృతి, పురస్కారాన్ని అంతర్జాతీయంగా తెలుగు భాష, సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి సేవలందిస్తున్న లండన్‌లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా)కు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరామలు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుక్తా వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యప్రసాద్ కిల్లీకి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ భాష, సంస్కృతి కోసం కృషి చేసిన పాలకులు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. మండలి వెంకటకృష్ణారావు గొప్ప గాంధేయవాది అని, ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని అన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఆశించిన స్థాయిలో లేదన్నారు. త్వరలో బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న వర్సిటీని అంతర్జాతీయ తెలుగు విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలన్నారు. అలా చేయగలిగితే భాషకు, జాతికి, సంస్కృతికి ఎనలేని కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయులు, రాజరాజనరేంద్రుడు, విదేశీయులైన సీపీ బ్రౌన్, సర్ ఆర్థన్ కాటన్ వంటి మహానీయుల్లాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాయిలో భవనాలు నిర్మించడమే కాదు, పరిశోధకులు, అధ్యాపకులను నియమించాలని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సంచలన కేసుల్లో నిర్ణయం తీసుకున్నప్పుడు రాని గుర్తింపు, తెలుగు భాష గురించి మాట్లాడినప్పుడు తనకు వచ్చిందని తెలిపారు. ఆంగ్ల భాష నేర్చుకుంటేనే ప్రపంచంలో చలామణి అవుతామనే భావన నుంచి బయటకు రావాలన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసభలను నిర్వహించి భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు.
మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉభయ తెలుగురాష్ట్రాల్లోని తెలుగువారి కన్నా ప్రవాసులకే తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. భాషా సంస్కృతి పునరుజ్జీవం కోసం పాటుపడుతున్న అంతర్జాతీయ తెలుగు సంఘాలను అభినందించారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, మండలి వెంకటకృష్ణారావు, కేంద్రం సంచాలకులు ఆచార్య రెడ్డి శ్యామల, విస్తరణ సేవా విభాగం ఇన్‌ఛార్జి రింగు రామ్మూర్తి, సంస్థ కో`ఆర్డినేటర్ డా. విజయ్ పాల్ పాత్లోత్, గుజ్జుల రవీందర్ (జర్మనీ) పాల్గొన్నారు.













