తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఈ నిర్ణయం తీసుకొన్నది. హైకోర్టులో న్యావాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాస్ రావు, నామవరపు రాజేశ్వర్రావు పేర్లను గతంలోనే హైకోర్టు కొలీజియం సుప్రీం కోర్టుకు సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కూడా తాజాగా సమ్మతి చెప్పింది. వీరి పేర్లను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదిస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచురించాక కొత్త వారితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు.













