మహానగరంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో శ్రీరామ దండు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ భక్తజనం మధ్య ఈ శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. మంగళ్‌హట్ లోని సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2010 నుంచి హైదరాబాద్‌లో శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. 200 సంవత్సరాల చరిత్ర గల సీతారాం బాగ్‌లోని రామాలయం నుంచి సాంప్రదాయబద్దంగా శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్ – మంగళహట్ పీస్ – పురానా పుల్ – బేగంజబార్ – సిద్దంబర్ బజార్ – గౌలిగూడ – గురుద్వారా – రాంమందిర్ – తిలక్‌పార్క్ – పుత్లిబౌలి – కోఠి ఆంధ్రా బ్యాంక్ – బడిచౌడి మీదుగా యాత్ర కొనసాగింది. వేలాది మంది భక్తజనులతో జైశ్రీరాం నినాదాలతో నగరమంతా మారుమ్రోగింది. ప్రశాతంమైన వాతావరణంలో శాంతియుతంగా ఈ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవునా అన్న పానీయాలు అందుబాటులో ఉంచారు. యాత్రలో శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషదారణలో కనిపించారు.













